Justin Trudeau | టొరంటో, నవంబర్ 8: కెనడా-భారత్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో.. వివాదానికి కారణమైన ఖలిస్థానీల గురించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక ప్రకటన చేశారు. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాలో ఉన్నారని అంగీకరించారు.
ఒట్టవాలోని పార్లమెంట్ హిల్లో ఇండో కెనడియన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వం ఖలిస్థానీ అతివాదులకు స్వర్గధామంగా ఉందని భారత్ చేసిన ఆరోపణలను పరోక్షంగా అంగీకరిస్తూ కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. ఇటీవల ట్రూడో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు కారణంగానే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా, ఖలిస్థానీల పట్ల ట్రూడో వైఖరి వారిలో సాధికారిత కల్పిస్తూ, ఆధునిక సిక్కుల్లో భయం పుట్టిస్తున్నదని రెండు రోజుల క్రితం సిక్కు, మాజీ మంత్రి ఉజ్జల్ దోసంజ్ విమర్శించారు.