Canada | ఒట్టావా, నవంబరు 1: భారత్‌ను అధికారిక పత్రంలో మొదటిసారిగా ‘విరోధి’ అని కెనడా పేర్కొన్నది. కెనడా ప్రభుత్వ సంస్థ అయిన కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ గురువారం ‘నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్మెంట్ 2025-26’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్‌తో పాటు చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాను ‘దేశ విరోధులు’గా పేర్కొన్నది.
భారత్ ప్రోత్సాహంతో కెనడా ప్రభుత్వ వ్యవస్థలకు వ్యతిరేక కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. దేశీయ సైబర్ సామర్థ్యాలతో అధునాతన సైబర్ వ్యవస్థను నిర్మించాలని భారత నాయకత్వం భావిస్తున్నదనితెలిపింది. గూఢచర్యం కోసం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, ప్రపంచంలో భారత హోదాను పెంచుకోవడానికి, తమకు వ్యతిరేకంగా వచ్చే కథనాలను ఎదుర్కొనేందుకు ఈ సైబర్ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నది.