టొరంటో, అక్టోబర్ 19: భారత్‌పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. కెనడాలో మిగిలిన భారత దౌత్యవేత్తలపై నిఘా ఉంచినట్టు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు, విమర్శలతో ఇప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. ఒట్టావాలోని భారత హై కమిషనర్‌ను సిక్కు వేర్పాటువాది హత్య కేసులో అనుమానితునిగా చేర్చి కయ్యానికి కాలు దువ్విన కెనడా తన వైఖరిని కొనసాగిస్తూనే ఉంది.
ఈ సందర్భంగా జోలి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వియన్నా సదస్సు ఒప్పందానికి వ్యతిరేకంగా వ్యవహరించిన, కెనడా వాసుల జీవితాలను ప్రమాదంలో పెట్టడానికి ప్రయత్నించిన ఏ ఒక్క దౌత్యవేత్తను సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె భారత్‌ను రష్యాతో పోల్చారు. కెనడాలో జరుగుతున్న హత్యలకు, బెదిరింపులకు భారత దౌత్యవేత్తలకు సంబంధం ఉందని ఆరోపించారు. మిగిలిన భారత దౌత్యవేత్తలనూ బహిష్కరిస్తారా అన్న ప్రశ్నపై జోలి మాట్లాడుతూ వారు ఇప్పటికే పూర్తి నిఘాలో ఉన్నారని తెలిపారు.