బీజింగ్ : తరచూ వడ గాడ్పులకు గురవడం వల్ల మానవ శరీరంలోని జీవ సంబంధ వయసు పెరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది. ధూమపానం, మద్యపానం వల్ల వృద్ధాప్యం వచ్చే స్థాయితో దీనిని పోల్చవచ్చు. చైనాలోని హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. వీరు తైవాన్‌లోని 25,000 మందికి చెందిన వైద్య నివేదికలను 14 ఏండ్ల పాటు విశ్లేషించి, ఈ నివేదికను రూపొందించారు.
ఎంత ఎక్కువగా వడగాడ్పులకు గురైతే, అంత వేగంగా వృద్ధాప్యం వస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. మానవ ఆరోగ్యంపై వేడెక్కుతున్న భూమి శరీర ధర్మ సంబంధిత ఒత్తిళ్ల ప్రభావం గురించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తున్నది.