London : భారత సంతతి మహిళను ఆంటీ అని పిలిచినందుకు, ఆమెకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది ఒక కోర్టు. ఈ ఘటన యూకేలోని వెస్ట్ లండన్‌లో జరిగింది. యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్)లో ఐడా ఎస్టీవ్స్ అనే ఒక భారత సంతతి మహిళ అసిస్టెంట్‌గా పని చేస్తుండేది. అదే చోట ఘనాకు చెందిన చార్లెస్ అప్పాంగ్ అనే మరో మహిళ అక్కడ నర్స్‌గా పనిచేస్తుండేది.
అయితే, చార్లెస్.. భారత సంతతి మహిళను ఆంటీ అంటూ పిలిచింది. తరచూ అలా పిలుస్తూ మానసికంగా వేధింపులకు గురి చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఐడా ఎస్టీవ్స్.. తనను చార్లెస్ అవమానించిందంటూ, పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై వాట్ఫోర్డ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ జడ్జి జార్జ్ అల్లియోట్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది విచారణ జరిపింది. తాజాగా దీనిపై తీర్పు వెల్లడించింది. భారత సంతతి మహిళకు 1,425.15 పౌండ్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంటీ అని పిలవడాన్ని తప్పుబట్టింది. ఇలా పిలవడాన్ని వయసు, లింగబేధం పరంగా వేధింపులుగా పరిగణించింది. ఆమె అలా పిలవొద్దని చాలా సార్లు చెప్పినప్పటికీ, చార్లెస్ పట్టించుకోలేదని, ఆంటీ అని పిలిచి అక్కడి వాతావరణాన్ని పాడు చేసిందని కోర్టు అభిప్రాయపడింది.
చార్లెస్ సొంత దేశమైన ఘనా సంస్కృతిలో ఆంటీ అని పిలవడం గౌరవమే అయినప్పటికీ, ఐడా ఎస్టీవ్స్ దృష్టిలో అది ఇబ్బందికరమే అని, పైగా తను అలా పిలవొద్దని చెప్పినా వినకుండా పిలిచినందుకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని వెస్ట్ లండన్ ఎన్హెచ్ఎస్ ట్రస్ట్‌ను ఆదేశించింది. ఈ ఘటన 2023 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగింది.