మాస్కో: ప్రస్తుతం రష్యాపై తీవ్ర ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో డాలర్ రూపంలో ఆ దేశంతో వాణిజ్యం సాగడం లేదు. ఈ నేపథ్యంలో నేరుగా రష్యాతో లావాదేవీలు జరిపేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంది. రూపాయి, రూబుల్ మధ్య పేమెంట్స్ నేరుగా జరగనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఏ శక్తివేల్ తెలిపారు. ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రూబుల్తో నేరుగా వాణిజ్యం చేస్తే, అప్పుడు డాలర్‌ను పక్కనపెట్టేసినట్లే అవుతుందన్నారు. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నాయి. లావాదేవీల కోసం అమెరికా కరెన్సీ డాలర్‌ను వాడకుండా ఆ దేశాన్ని నిలువరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు ఆసక్తి చూపుతున్న భారత్.. వాణిజ్యంలో భాగంగా రూపాయితో కొనుగోళ్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా వాణిజ్యం నిర్వహించేందుకు ఇండియాలోని అయిదు జాతీయ బ్యాంకులు నేరుగా అవకాశం కల్పించనున్నట్లు భావిస్తున్నారు. ఈ దిశగా చర్యలు కూడా సాగుతున్నాయని తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నర్, కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు ఆయా బ్యాంకులు కూడా ఆ కార్యచరణ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రష్యా ఎదుర్కొంటున్న ఆంక్షలతో ఇండియాకు లబ్ధి చేకూరుతుందని, ఎందుకంటే భారతీయ కంపెనీలకు రష్యన్ మార్కెట్లో విస్తరించే అవకాశం లభిస్తుందని శక్తివేల్ అన్నారు.