వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థి పుచ్చా వరుణ్ రాజ్‌పై అక్టోబర్ 29న అమానుష దాడి జరిగింది. జిమ్ నుంచి తిరిగి వెళ్తున్న వరుణ్ రాజ్‌పై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన వరుణ్‌రాజ్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై తాజాగా అమెరికా స్పందించింది. భారత విద్యార్థిపై దాడి ఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొంది. వరుణ్ రాజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు అమెరికాలోని ఇండియానా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, ఖమ్మం జిల్లా మామిళ్లగూడేనికి చెందిన 24 ఏండ్ల పుచ్చా వరుణ్ రాజ్ అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోగల వల్పరైసో నగరంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. రోజూలాగే అక్టోబర్ 29న జిమ్‌కు వెళ్లిన వరుణ్ తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు కత్తితో తలపై పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం లైఫ్ సపోర్టుపై వరుణ్‌కు చికిత్స అందుతున్నది.
అయితే వరుణ్ మెడికల్ రిపోర్టులను బట్టి చూస్తే ఆయనకు తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వరుణ్‌పై దాడికి పాల్పడినది 24 ఏళ్ల జోర్డాన్ అండ్రాడేగా గుర్తించామని, అతడి అరెస్టు చేసి విచారిస్తున్నామని ఇండియానా పోలీసులు తెలిపారు.