Student visa : స్టూడెంట్ వీసాల విషయంలో భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. వీసాలు హక్కు కాదని, అది ఒక ప్రత్యేక గౌరవం మాత్రమే అని తెలిపింది. స్టూడెంట్ వీసాలపై వెళ్లిన విద్యార్థులు అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నిబంధనలు పాటించకపోతే.. వీసాల రద్దు, స్వదేశాలకు తరలింపు, కొంతకాలం వరకు బ్లాక్ లిస్టులో పెట్టడం, అరెస్టు చేయడం వంటి చర్యలుంటాయని తెలిపింది.
భవిష్యత్తులో అమెరికాకు రాకుండా నిషేధం కూడా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. భారతీయ విద్యార్థులు సహా విదేశీయులు స్థానిక చట్టాలను గౌరవించాలని సూచించింది. ఇటీవల అమెరికా స్టూడెంట్ వీసాల్ని కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే వర్కింగ్ వీసాలు, టూరిస్ట్, బిజినెస్ వీసాల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తోంది.
అన్ని విభాగాల్లోనూ కొత్త వీసాల మంజూరులో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. నిబంధనలు పాటించని వారిని బలవంతంగా స్వదేశాలకు పంపిస్తున్న సంగతి తెలిసిందే.