Brazil Plane Crash | బ్రెసిలియా: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకొన్నది. 62 మందితో వెళ్తున్న ఓ విమానం శుక్రవారం విన్హెడో పట్టణంలో కూలిందని స్థానిక టీవీ స్టేషన్ గ్లోబోన్యూస్ వెల్లడించింది. విమానంలోని ప్రయాణికులందరూ మృతిచెందినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.
వోపాస్ లిన్హాస్ ఏరియాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పరన రాష్ట్రంలోని కాస్కవెల్ నుంచి సావో పౌలోలోని గువారుల్హోస్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని వెబ్సైట్ జీ1 పేర్కొన్నది.
విన్హెడోలో విమానం కూలిన విషయాన్ని సావో పౌలో రాష్ట్ర అగ్నిమాపక విభాగం ధ్రువీకరించింది. ఘటనాస్థలికి బృందాలను పంపినట్టు తెలిపింది. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు అయింది. విమానం చెట్లలోకి పడిపోవడం, పెద్దయెత్తున నల్లటి పొగ ఆవరించడం కనిపించింది.