బీజింగ్: విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లో అతికించడం సాధ్యమేనా అంటే అవుననే అంటున్నాడు ఈ చైనా వైద్యుడు. గంటల తరబడి ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు సర్జరీ చేస్తే తప్ప ఎముకలు అతకడం కష్టం. అలాంటిది మూడు నిమిషాల్లోనే అతికేలా సూది మందు ‘బోన్ గ్లూ’ను తన బృందంతో కలిసి అభివృద్ధి చేశారు. తూర్పు చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్‌లో ఈ పరిశోధనలు పూర్తయ్యాయి. ‘బోన్ 02’ అని దీనికి పేరు పెట్టినట్టు స్థానిక మీడియా తెలిపింది.
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ బృంద వైద్యుడు లిన్ షాన్పింగ్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఈ జిగురు లాంటి సూది మందు రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకలు అతికేలా చేస్తుందని, గతంలో లాగా శరీర కోతలు అవసరం లేకుండా కేవలం ఒక సూదితో ఎముకలు అతికించవచ్చని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పరిశోధనలు కూడా పూర్తయ్యాయని, ఇది పూర్తి సురక్షితమని తెలిపారు. దీని కారణంగా ఎలాంటి రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు ఉండబోవని చెప్పారు. నీటి లోతులో ఉండే ఆల్చిప్పలే ప్రేరణగా ఈ బోన్ గ్లూ ఇంజెక్షన్‌ను తయారు చేసినట్టు ఆయన తెలిపారు.