Thailand : థాయ్లాండ్ నావికా దళానికి చెందిన యుద్ధ నౌక రెండు రోజుల క్రితం గల్ఫ్ సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసింది. దక్షిణ చైనా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో థాయ్లాండ్ నౌకాదళం, సైన్యం నాలుగు యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో 50 చదరపు కిలోమీటర్ల దూరంలో గాలింపు చర్యలు చేపట్టాయి. రెండో రోజు ఉదయం ఒక నావికుడిని రక్షించామని, అతని ఆరోగ్యం బాగానే ఉందని థాయ్ నౌకాదళం అధికారి ఒకరు తెలిపారు. రెండో రోజుల తర్వాత నలుగురు నావికుల మృతదేహాలు లభించాయి. గల్లంతైన మిగతావాళ్లను వెతికేందుకు రెస్క్యూ బృందాలు ఇంకా గాలింపును కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకూ రెస్క్యూ టీమ్ 76 మందిని రక్షించింది.
‘లైఫ్ జాకెట్లు, లైఫ్ బెల్టులు రెండు రోజులు మాత్రమే గల్లంతు అయినవాళ్ల ప్రాణాలు కాపాడగలవు. అందుకని మంగళవారం గాలింపు అనేది చాలా కీలకం. అందుకని గల్లంతైన నావికులలో ఎక్కువ మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తాం’ అని వైస్ అడ్మిరల్ పిచాయ్ లొర్చుసకుల్ తెలిపారు. 105 మంది సిబ్బంది ఉన్నహెచ్టిఎమ్ఎస్ సుఖోథాయ్ అనే యుద్ధ నౌక గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్ వద్ద ఆదివారం రాత్రి మునిగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నావికులు నౌక నుంచి నీళ్లలోకి దూకేశారు. ఈ ప్రమాదంలో 29 మంది నావికులు గల్లంతయ్యారు.