Boats Sink : యెమెన్ (Yemen), జిబౌటీ (Djibouti) తీరాల మధ్య సముద్రంలో ఘోరం జరిగింది. బతుకుదెరువు కోసం దేశ విడిచి వెళ్తున్న 188 మంది బతుకులు నడిసంద్రంలో కలిసిపోయాయి. గల్ఫ్ దేశాల్లో (Gulf countries) ఉపాధి కోసం వెళ్తున్న కూలీలను తీసుకెళ్తున్న నాలుగు పడవలు (Four boats) మార్గమధ్యలో మునిగిపోయాయి. దాంతో ఆ పడవల్లో ప్రయాణిస్తున్న 188 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మీడియాకు తెలిపింది.
తమ దేశంలో ఘర్షణల నుంచి బయటపడేందుకు ఇథియోపియా ప్రజలు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు. అందుకు ఈ ప్రమాదం జరిగిన మార్గాన్నే ఉపయోగిస్తుంటారు. అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గం. ఈ మార్గంలో గత జనవరిలో కూడా ఇదే తరహా ప్రమాదం జరిగింది. యెమెన్ తీరంలో పడవ మునిగి 20 మంది ఇథియోపియన్స్ ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 2024 ఏడాదిలో మొత్తం 558 మంది ఈ మార్గంలో మరణించారు.
సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.