Vatican City | క్యాథలిక్ క్రైస్తవుల అధినేత పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త పోప్‌ని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో వాటికన్ సిటీలోని తదుపరి పోప్‌ను ఎన్నుకునేందుకు వాటికన్ సిటీలోని ప్రఖ్యాత సిస్టైన్ చాపెల్ తలుపులు మూసివేశారు. 133 మంది కార్డినల్స్ శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. రహస్యంగా సమావేశమై పోప్‌ను ఎన్నుకుంటారు. రెడ్‌కలర్ దుస్తులు ధరించిన కార్డినల్స్ సిస్టైన్ చాపెల్లోకి ప్రవేశిస్తుండగా.. తర్వాతి పోప్‌ను ఎన్నుకునేలా వారికి పవిత్రాత్మ సాయం చేయాలని నినదించారు. పోప్ ఫ్రాన్సిస్ హయాంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వ్యవహరించిన కార్డినల్ పియట్రో పెరోలిన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ప్రస్తుతం తర్వాతి పోప్‌గా ఎన్నికయ్యేందుకు ఆయనకే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు 70 దేశాలకు చెందిన 133 మంది కార్డినల్స్ పోప్ ఎన్నికలో పాల్గొంటారు. ఈ క్రమంలో రానున్న కొన్ని రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. లోపలకు వెళ్లడానికి ముందే వారి సెల్ఫోన్లను ఇచ్చేశారు. చర్చలు బయటకు రాకుండా వాటికన్ చుట్టూ జామర్లను అమర్చి కమ్యూనికేషన్‌ని నిలిపివేశారు. పోప్ అయ్యే వ్యక్తికి 89 ఓట్లు రావాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల మెజారిటీ వస్తేనే పోప్‌గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నిర్దిష్ట కాల పరిమితి లేదు. దాంతో ఎన్నిరోజులైనా పట్టొచ్చు. ఈ సారి కొత్త పోప్ ఎన్నికలో నలుగురు భారత్‌కు చెందిన కార్డినల్స్ సైతం ఓటు వేయనున్నారు. గోవా, డామన్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రావ్ , హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోనీ పూల, తిరువనంతపురం మేజర్ ఆర్చ్ బిషప్ కార్డినల్ బసేలియోస్ క్లీమిస్ తొట్టుంకల్, వాటికన్లోని మతాంతర సంప్రదింపుల విభాగం ప్రిఫెక్ట్‌గా పనిచేస్తున్న కార్డినల్ జార్జ్ జాకబ్ కూవక్కాడ్ ఓటింగ్‌లో పాల్గొనున్నారు.
ఇదిలా ఉండగా.. బుధవారం కాథలిక్ చర్చికి కొత్త పోప్ ఎన్నిక సమయంలో సిస్టైన్ చాపెల్ చిమ్నీ నుంచి నల్లటి పొగ వెలువడింది. ఇది కార్డినల్స్ నిర్వహించిన తొలి ఓటుతో తర్వాతి పోప్ నిర్ణయించలేమని సూచిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో వేలాది మంది క్రిస్టియన్స్ గుమిగూడారు. సిరియా వాటికన్ రాయబారి కార్డినల్ మారియో జెనారి మాట్లాడుతూ.. తర్వాత పోప్ ఎవరో తెలుసుకునేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. అయితే, చిమ్నీ నుంచి నల్లటి పొగ వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. పోప్ ఎన్నికలో పాల్గొనే 133 మంది కార్డినల్స్ ఉదయం సెషన్లో ప్రతిరోజూ రెండుసార్లు, మధ్యాహ్నం రెండుసార్లు ఓటు వేస్తారు. పోప్ నామినీ కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీ పొందే వరకు ఈ క్రమం కొనసాగుతుందని సంబంధితర వర్గాలు తెలిపాయి. పోప్ ఎన్నికలో ఎవరికీ 89 ఓట్లు రాకపోతే బ్యాలెట్ పత్రాలు కాలిపోతాయని.. ఈ సమయంలో ప్రత్యేక రసాయనం జోడించడం వల్ల బ్యాలెట్ పత్రాల నుంచి నల్లటి పొగ వస్తుందని.. దీనికి అర్థం కొత్త పోప్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అర్థమని.. కొత్త పోప్‌ని ఎన్నుకున్నప్పుడే తెల్లటి పొగ వస్తుందని సంబంధిత వర్గాలు వివరించాయి.