ఢాకా: బంగ్లాదేశ్ జైలులో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత ఖలీదా జియా(Khaleda Zia)ను రిలీజ్ చేయాలని దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్ ఆదేశించారు. జియా ప్రత్యర్థి.. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు. షాహబుద్దిన్ నేతృత్వంలో జరిగిన మీటింగ్లో.. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చీఫ్ జియాను రిలీజ్ చేయాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష మీడియా కార్యాలయం పేర్కొన్నది. ఆర్మీ చీఫ్ జనరల్ వాకేర్ ఉజ్ జమాన్ తో పాటు నేవీ, వాయుసేన చీఫ్లు కూడా ఆ మీటింగ్కు హాజరయ్యారు. విద్యార్థి నిరసనల సమయంలో అరెస్టు అయిన వారిని కూడా రిలీజ్ చేయాలని మీటింగ్లో నిర్ణయించారు. 78 ఏళ్ల ఖలీదా జియా ఆరోగ్యం క్షీణించింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2018లో అవినీతి కేసులో ఆమెకు 17 ఏళ్ల జైలుశిక్ష విధించారు.