బ్రసిలియా: మానవులు కోతుల నుంచి మార్పు చెందారనడానికి ఒక పసి బాలుడు ఉదాహరణగా నిలిచాడు. 12 సెంటీమీటర్ల పొడవున్న ‘మానవ తోక’తో బాల హనుమంతుడు పుట్టాడు. ఆ శిశువు తోక చివరన బంతి మాదిరిగా ఉండటం మరింత విస్మయానికి గురిచేసింది. వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన బ్రెజిల్లో జరిగింది.
ఫోర్టలేజా నగరంలోని ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఎటువంటి సమస్యలు లేకుండా నెలలు నిండని మగ పిల్లవాడు జన్మించాడు. ఆ శిశువును వైద్యులు పరిశీలించగా ఒక వైపు పిర్ర నుంచి 12 సెంటీమీటర్ల పొడవైన తోక ఉన్నది. ఆ తోక చివరన బంతి మాదిరిగా గుండ్రంగా ఉన్నది.
కాగా, డాక్టర్లు ఆ శిశువు తోకను చాలా ప్రత్యేక ఆసక్తితో పరిశీలించారు. మృదువైన కణజాలం (మృదులాస్థి) లేదా ఎముక వంటివి ఆ తోక భాగంలో లేవని గుర్తించారు. ఇది ‘నిజమైన మానవ తోక’కు అరుదైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇలా తోకతో శిశువు పుట్టడం చాలా అరుదని అన్నారు.
మరోవైపు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇప్పటి వరకు ఎముక లేని తోకతో సుమారు 40 మంది పిల్లలు జన్మించినట్లు తెలుస్తున్నది. ‘జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ కేస్ సర్జరీ రిపోర్ట్స్’లోని కేస్ స్టడీ ప్రకారం, నిజమైన మానవ తోకతో జన్మించిన పిల్లలు చాలా తక్కువ. మానవులకు ‘అనాదిగా ఉండే తోక’ ఈ శిశువులకు గర్భంలోనే పెరుగడం ప్రారంభమైనట్లు ఆ అధ్యయనం పేర్కొంది.
కాగా, అందరి శిశువుల మాదిరిగానే, గర్భధారణ అనంతరం ఈ శిశువు పిండం కూడా నాలుగు నుండి ఎనిమిది వారాల తర్వాత అభివృద్ధి చేందినట్లు ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ స్కాన్‌తో శిశువును పూర్తిగా పరిశీలించారు. ఈ శిశువు నాడీ వ్యవస్థకు తోక అటాచ్ కాలేదని నిర్ధారించారు. దీంతో అనుబంధ తోక భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించాలని సర్జన్లు నిర్ణయించారు.
మరోవైపు, కొన్ని విశ్వాసాలు, మత సంస్కృతుల ప్రకారం ఇలా తోకతో అరుదుగా జన్మించిన వారిని పవిత్రంగా భావించడంతోపాటు దైవంగా నమ్మి పూజలు కూడా చేస్తుంటారు.