బీజింగ్: ఉత్తర చైనాలోని ఓ బొగ్గు గని(China Coal Mine)లో భారీ పేలుడు ఘటన సంభవించింది. ఆ ప్రమాదంలో సుమారు 82 మంది కార్మికులకు చనిపోయారు. ఇంకా అనేక డజన్ల సంఖ్యలో కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు చెప్పారు. షాంజి ప్రావిన్సులో ఉన్న లియుషెన్యు బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఆ గనిలో గ్యాస్ పేలుడు ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో సుమారు 247 మంది వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. షాంజి టాంగ్జీ గ్రూపు ఈ గనిని నిర్వహిస్తున్నది.
తీవ్ర విషాదకర ప్రమాదం జరిగిన నేపథ్యంలో.. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మిస్సైన వారి కోసం పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. గాయపడ్డవారికి చికిత్స అందించాలన్నారు. ఈ ఘటన పట్ల సమగ్రమైన రీతిలో విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. క్విన్యున్ కౌంటీలో ఆ బొగ్గు గని ఉన్నది. గ్యాస్ పేలుడు జరగడం వల్ల మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తం కావాలని, పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని జిన్పింగ్ అన్నారు.