బీజింగ్: చైనాలో ఓ ఆగంతకుడు తన కారుతో(Car Attack) బీభత్సం సృష్టించాడు. దక్షిణ చైనాలోని హుహయిలో స్టేడియం వద్ద కారుతో జనం మీదకు దూసుకెళ్లాడు. ఆ అటాక్‌లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది గాయపడ్డారు. స్టేడియం వద్ద స్పోర్ట్స్ ట్రాక్‌పై కసరత్తులు చేస్తున్న జనంపై కారును తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిలో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. కారును డ్రైవ్ చేసిన 62 ఏళ్ల వ్యక్తిని మిస్టర్ ఫాన్‌గా గుర్తించారు. ఇటీవల విడాకులు తీసుకున్న అతను.. అసంతృప్తితో ఈ అఘయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. జుహయి స్పోర్ట్స్ సెంటర్ నుంచి పారిపోతున్న ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. గాయాలు కావడంతో అతను కోమాలోకి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు కఠినమైన శిక్షను వేస్తామని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. గాయపడ్డవారికి పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తామన్నారు.