బీజింగ్: చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యధిక జనాభా కలిగిన షాంఘై నగరంలోని డిస్నీల్యాండ్‌ను మూసివేశారు. మరో వైపు వ్యాపారవేత్తలకు కీలక నగరమైన షెంజెన్‌లో షాపులు, ఆఫీసులను వారం రోజుల తర్వాత తెరిచారు.
చాంగ్‌చున్, జిలిన్ నగరాల్లో మరోసారి సామూహిక వైరస్ టెస్టింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిలిన్లో 20 లక్షల జనాభా ఉంది. ఆ నగరంలో ప్రస్తుతం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఇతర దేశాలతో పోలిస్తే, చైనాలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నా.. ఆ దేశం మాత్రం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తోంది. ఆదివారం రోజున చైనాలో కొత్తగా 2027 కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో జిలిన్ ప్రావిన్స్‌లోనే 1542 కేసులు బయటపడ్డాయి.
షాంఘైలో సుమారు 2.5 కోట్ల జనాభా ఉంది. అక్కడ నగరవ్యాప్తంగా షట్‌డౌన్ విధించలేదు. కానీ స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోకి బస్సు సర్వీసులను రద్దు చేశారు. విజిటర్స్ ఎవరు వచ్చినా వైరస్ నెగటివ్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. షాంఘై డిస్నీల్యాండ్, డిస్నీటౌన్, విషింగ్ స్టార్ పార్క్‌లను మూసివేస్తున్నట్లు డిస్నీ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.