Donald Trump | కైరో: గాజా, వెస్ట్ బ్యాంక్లలోని పాలస్తీనీయులను తాత్కాలికంగా ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు తరలించాలనే ఆలోచనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ, గాజా ప్రజలు నిరాశ్రయులయ్యారని, వారికి తాత్కాలికంగా లేదా సుదీర్ఘ కాలంపాటు ఆశ్రయం ఇవ్వాలని జోర్డాన్, ఈజిప్ట్ దేశాలను కోరుతానని చెప్పారు. ఆ సమయంలో గాజా ప్రాంతాన్ని పరిశుభ్రం చేయవచ్చునని అన్నారు.
అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, కతార్ దేశాల ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు, పాలస్తీనా సీనియర్ అధికారి హుస్సేన్ అల్ షేక్ కైరోలో సమావేశమయ్యారు. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో, ఇటువంటి ఆలోచనలు ఈ ప్రాంతంలో సుస్థిరతకు ముప్పు తెస్తాయని, ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని, ప్రజలు ప్రశాంతంగా జీవించే అవకాశాలు ఉండవని తెలిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాల పరిష్కారం ఆధారంగా మధ్య ప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.