భార్య బహుమతిగా ఇచ్చిన యాపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. అసాధారణమైన గుండె లయను గుర్తించి అతడికి సాధారణ జీవితాన్ని ప్రసాదించింది. యాపిల్ వాచ్ హెచ్చరికలతో గుండె ఆపరేషన్ చేయించుకున్న అతడు ప్రస్తుతం సాధారణ జీవనం గడుపుతున్నాడు.
ఈ సంఘటన యూకేలో జరిగింది. డేవిడ్ లాస్ట్ (54)కు ఈ ఏడాది ఏప్రిల్‌లో బర్త్ డే గిఫ్ట్‌గా అతడి భార్య యాపిల్ వాచ్ బహుమతిగా ఇచ్చింది. కాగా, ఇటీవల యాపిల్ వాచ్‌లోని సెన్సార్ దాదాపు 3,000 సందర్బాల్లో తక్కువ హృదయ స్పందన ఉన్నట్టు గుర్తించి, లాస్ట్ను హెచ్చిరించింది. దీంతో అతడు దవాఖానకు వెళ్లాడు. వైద్యులు 48 గంటలపాటు వివిధ పరీక్షలు చేశారు. ఈ సమయంలో 138 సార్లు గుండె ఆగిపోయే స్థితికి వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. గుండెలో భారీ అడ్డంకి ఉందని చెప్పారు. చివరగా, అతడికి ఆపరేషన్ చేసి, పేస్‌మేకర్‌ను అమర్చారు. కాగా, తన ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్‌ను ఎప్పటికీ తనతోనే ఉంచుకుంటానని డేవిడ్ ఉద్వేగపూరితంగా తెలిపాడు.