న్యూఢిల్లీ : సాధారణ ప్రజలు జీవించేందుకు వీలులేని అత్యంత ఖరీదైన నగరాలు ఏవంటే మనలో ఎక్కువ మందికి ముందుగా సింగపూర్, పారిస్ పేర్లు గుర్తుకొస్తాయి. అయితే 2021లో పరిస్ధితులు మారిపోయాయి. తాజాగా ప్రచురితమైన ఓ సర్వేలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయల్‌కు చెందిన టెల్అవీవ్ మొదటి స్ధానంలో నిలిచింది.
ద్రవ్యోల్బణంతో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయం ఎగబాకిన క్రమంలో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) వెల్లడించిన వరల్డ్‌వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సూచీలో టెల్అవీవ్ అగ్రభాగానికి చేరింది. అమెరికా డాలర్లతో వస్తువులు, సేవల ధరలను పోల్చిచూడగా 173 నగరాలతో కూడిన సుదీర్ఘ జాబితాలో టెల్అవీవ్ ఐదు స్ధానాలు ఎగబాకి తొలిస్ధానానికి చేరుకుంది. గత ఏడాది ఈ సూచీలో పారిస్ ముందువరసలో ఉండగా ఇప్పుడు సింగపూర్‌తో కలిసి రెండో స్ధానం పంచుకుంది.
డాలర్‌తో ఇజ్రాయల్ కరెన్సీ బలపడటంతో పాటు రవాణా, నిత్యావసరాల ధరల పెరుగుదలతో టెల్అవీవ్ అత్యంత ఖరీదైన నగరంగా మారింది. ఇక పారిస్, సింగపూర్ల తర్వాత ఈ జాబితాలో జురిచ్, హాంకాంగ్‌లు నిలిచాయి. న్యూయార్క్ ఆరో స్ధానంలో, జెనీవా ఏడో స్ధానంలో ఉండగా కోపెన్‌హ్యాగన్, లాస్ఏంజెల్స్, ఒసాకా నగరాలు టాప్ టెన్‌లో ఉన్నాయి.