iPhone | సాధారణంగా ఐఫోన్ సైజ్ ఎంత ఉంటుంది? గరిష్ఠంగా ఐఫోన్ ప్రో మ్యాక్స్ వర్షన్లో 6.7 ఇంచుల డిస్ప్లే ఉంటుంది. మిగిలిన అన్ని ఫోన్లలోనూ ఇతర స్మార్ట్ఫోన్ల కంటే తక్కువ పరిమాణంలోనే ఉంటాయి కదా! మరి 8 అడుగుల భారీ ఐఫోన్‌ను ఎప్పుడైనా చూశారా? అమ్మో! అంత పెద్ద యాపిల్ ఫోన్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలోని ఈ భారీ ఫోన్ దర్శనమిచ్చింది. ప్రముఖ యూట్యూబర్ మ్యాథ్యూ భీమ్ రీసెంట్గా దీన్ని పట్టుకుని న్యూయార్క్ వీధుల్లోకి వచ్చాడు. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
యూట్యూబర్ మ్యాథ్యూనే ఈ భారీ ఐఫోన్‌ను తయారుచేశాడు. భారీ ఐఫోన్ అంటే కేవలం ఆకారంలో మాత్రమే దాన్ని పోలి ఉంటుందని అనుకుంటున్నారేమో! చూడ్డానికే కాదు ఇది అచ్చం ఐఫోన్‌లాగే పనిచేస్తుంది. ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఐవోఎస్నే ఉంది. ఈ మొబైల్‌తో ఫొటోలు తీయొచ్చు. గేమ్స్ ఆడొచ్చు. యాపిల్ పే సహాయంతో పేమెంట్స్ చేయొచ్చు. ఫేస్ టైమ్ ఉపయోగించి కాల్స్ కూడా చేయొచ్చు. లాక్ బటన్, వాల్యూమ్ బటన్స్, మ్యూట్ బటన్ అన్నీ కూడా అచ్చం ఒరిజినల్ ఐఫోన్ మాదిరిగానే పనిచేస్తున్నాయి. నిజానికి ఇంత భారీ ఐఫోన్ తయారుచేయడం ఇదే తొలిసారి ఏమీ కాదు. 2020లో ZHC అనే యూట్యూబర్ ఆరడుగుల ఐఫోన్‌ను తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును తాజాగా మ్యాథ్యూ బ్రేక్ చేసి 8 అడుగుల ఐఫోన్‌ను తయారు చేశాడు.
తాను సొంతంగా తయారు చేసిన ఈ భారీ ఐఫోన్‌ను తీసుకుని మ్యాథ్యూ రీసెంట్గా న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దాన్ని ప్రజలకు చూపిస్తూ వాళ్ల ఒపినీయన్స్ సేకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను మ్యాథ్యూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో భారీ మొబైల్‌ను ఎలా తయారు చేశాడో కూడా చూపించాడు. ఇంత భారీ ఫోన్ తయారీ కోసం ఐఫోన్ ఒరిజినల్ పార్ట్స్ దొరక్కపోవడంతో వివిధ ప్రొడక్ట్స్‌కి చెందిన కాంపొనెంట్లను ఉపయోగించాడు. ఐఫోన్లో భారీ స్క్రీన్ కోసం టీవీల్లో వాడే టచ్ ప్యానెల్ ఉన్న స్క్రీన్‌ను ఉపయోగించాడు. సీమ్‌లెస్ ఎక్స్పీరియన్స్ కోసం స్క్రీన్చుట్టూ లేజర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దాన్ని మ్యాక్ మినీకి కనెక్ట్ చేశాడు. దీంతో ఆ భారీ మొబైల్ అచ్చం ఐఫోన్‌లాగే మారిపోయింది.