వాషింగ్టన్: మానవ శరీర భాగాలు కొనుగోలు చేసి వాటిని ఫేస్బుక్ ద్వారా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ సంఘటన జరిగింది. ఎనోలాకు చెందిన 40 ఏళ్ల జెరెమీ లీ పాలీ, మానవ శరీర భాగాల అమ్మకానికి ప్రయత్నించాడు. లిటిల్ రాక్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సాస్ ఫర్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన మార్చురీలో పని చేసే మహిళా సిబ్బంది నుంచి మానవ శరీర భాగాలు, అవశేషాలను అతడు కొనుగోలు చేశాడు. అనంతరం తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వాటిని అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన యాడ్లు పోస్ట్ చేశాడు. అమ్మకానికి ఉంచిన మానవ శరీర భాగాల ఫొటోలను ‘ది గ్రాండ్ వుండర్కమ్మర్’ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఆడ్ అండ్ యూజువల్, మ్యూజియం ఎగ్జిబిట్స్, గెస్ట్ లెక్చర్లు, లైవ్ ఎంటర్టైన్మెంట్తోపాటు మరెన్నో వింతైన, అసాధారణమైన వాటిని తన వెబ్సైట్ ద్వారా ప్రత్యేకంగా అతడు అమ్ముతుంటాడు.
కాగా, మానవ శరీర భాగాల అమ్మకం విషయం బయటపడటంతో కలకలం రేపింది. దీంతో జూలై 22న జెరెమీని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తొలిసారి అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. మానవ శరీర భాగాల అక్రమ అమ్మకంపై దర్యాప్తు ప్రారంభించింది. జెరెమీ అమ్మకానికి పెట్టిన మానవ శరీర భాగాల్లో కొన్ని చట్టబద్ధంగా అమ్మేవి ఉండగా, మరికొన్నింటిని అక్రమంగా విక్రయించేందుకు అతడు ప్రయత్నించినట్లు ఎఫ్‌బీఐ అధికారి తెలిపారు.