Cancer | న్యూయార్క్, జనవరి 4: సిగరెట్, పొగాకు క్యాన్సర్‌కు కారణమవుతాయనే అవగాహన చాలామందికి ఉంది. అయితే, మద్యం విషయంలో మాత్రం భిన్నమైన మాటలు వినిపిస్తుంటాయి. రోజూ కొంత మోతాదులో మద్యపానం సురక్షితమేనని, రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఈ ప్రచారాలను అమెరికా సర్జన్ జనరల్ తాజా నివేదిక కొట్టిపారేసింది.
మద్యపానంలో సురక్షిత మోతాదు అనేదేమీ ఉండదని, ఎంత తాగినా ఆరోగ్యానికి నష్టం తప్పదని స్పష్టం చేసింది. పొగాకు లాగానే మద్యపానం కూడా క్యాన్సర్‌కు కారణమవుతుందని స్పష్టం చేసింది. మద్యపానంతో క్యాన్సర్ ముప్పుపై శుక్రవారం అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి ఒక నివేదికను విడుదల చేశారు. అమెరికాలో వైద్యపరంగా సర్జన్ జనరల్ హోదా కీలకమైనది. దేశాధ్యక్షుడు స్వయంగా నియమించే సర్జన్ జనరల్.. దేశ ప్రజలకు అవసరమైన ఆరోగ్య మార్గదర్శకాలను జారీ చేస్తారు.
2014 నుంచి అమెరికన్ క్యాన్సర్ సొసైటీతో పాటు వివిధ సంస్థలు క్యాన్సర్‌పై చేసిన అధ్యయనాల ఆధారంగా అమెరికా సర్జన్ జనరల్ ఈ నివేదికను విడుదల చేశారు. మద్యపానం వల్ల రొమ్ము, కొలొరెక్టల్(పెద్ద పేగు), అన్నవాహిక, కాలేయ, నోటి, గొంతు, స్వరపేటిక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొన్నది. ధూమపానం వల్ల 19 శాతం క్యాన్సర్ కేసులు, 29 శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని, అధిక శరీర బరువు వల్ల 7.8 శాతం క్యాన్సర్ కేసులు, 6.5 శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ రెండింటి తర్వాతి స్థానంలో మద్యపానం ఉందని, 5.6 క్యాన్సర్ కేసులకు, 4 శాతం క్యాన్సర్ మరణాలకు మద్యపానమే కారణమని వెల్లడించింది. యూవీ రేడియేషన్ కంటే మద్యం వల్లే క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు తెలిపింది.
అమెరికాలో ఏటా లక్ష క్యాన్సర్ కేసులకు, 20 వేల క్యాన్సర్ మరణాలకు మద్యపానమే కారణమవుతున్నదని ఈ నివేదిక వెల్లడించింది. మద్యపానం చేసే మహిళలకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొన్నది. బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 17 శాతం వాటికి మద్యపానం కారణం కావొచ్చని తెలిపింది. మహిళలు వారానికి కేవలం రెండు డ్రింక్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పురుషుల కంటే వారిలో ఎక్కువగా ఉంటున్నదని వెల్లడించింది.