న్యూఢిల్లీ: దుబాయ్‌లో నెంబర్ ప్లేట్ల వేలం జరిగింది. కార్లకు ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్లను జారీ చేశారు. ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నెంబర్లను కూడా వేలం వేశారు. ఈ వేలంలో AA8 నెంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూడవ నెంబర్ ప్లేట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. AA8 సింగిల్ డిజిట్ నెంబర్ దుబాయ్ వేలంలో 35 మిలియన్ల దీరమ్లకు అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో దాని విలువ రూ.70 కోట్లు. గత ఏడాది AA9 నెంబర్ ప్లేట్‌ను రూ.79 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఈ సారి పోటాపోటీగా వేలం జరిగింది. వన్ బిలియన్ మీల్స్ సంస్థ కోసం ఈ వేలం ద్వారా 53 బిలియన్ల దీరమ్‌లు ఆర్జించారు. ఆ డబ్బుతో 50 దేశాల్లో నిరుపేదలకు ఆహారం అందిచనున్నారు. దుబాయ్‌లోని ఆర్టీఏ ఈ వేలాన్ని ఆర్గనైజ్ చేసింది. తాజా వేలంలో డబుల్ డిజిట్ దుబాయ్ కారు ‘F55’నెంబర్ ప్లేట్ రూ.8.23 కోట్లకు అమ్ముడుపోయింది. మరో కార్ ప్లేట్ V66కు కూడా వేలంలో భారీ ధర పలికింది. ఆ నెంబర్ ప్లేట్‌ను రూ.7.91 కోట్లకు సొంతం చేసుకున్నారు.
ఇటీవల ఇండియాలోని చండీఘడ్‌లో ఓ హోండా యాక్టివ్ ఓనర్ వీఐపీ 0001 నెంబర్ ప్లేట్ కోసం 15 లక్షల చెల్లించిన విషయం తెలిసిందే. బ్రిజ్ మోహన్ అనే అడ్వర్టెయిజింగ్ ఏజెన్సీ వ్యక్తి ఈ నెంబర్ ప్లేట్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం దాన్ని అతను యాక్టివ్‌కు వాడుతున్నారు. దీపావళికి కారు కొన్న తర్వాత ఆ నెంబర్ ప్లేట్‌ను దానికి ఫిక్స్ చేయనున్నట్లు చెప్పారు.