Baldness | లండన్, మార్చి 23 : బట్టతలతో బాధపడుతున్నవారికి శుభవార్త. వంశపారం పర్యంగా, జన్యుపరంగా సంక్రమించిన బట్టతలకు చెక్ పెట్టే సరికొత్త చికిత్సను పరిశోధకులు కనుగొన్నారు. ఒక అంశంపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులకు మరో రోగానికి విరుగుడు లభించడం విశేషం. మానవ శరీరంలో ఉండే డియోక్సీరైబోస్ అనే షుగర్ జెల్ సాయంతో బట్టతలను నయం చేయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, పాకిస్థాన్‌లోని కాస్మట్స్ యూనివర్సిటీ పరిశోధకులు గాయాన్ని నయం చేయడంలో ఈ షుగర్ జెల్ పాత్రపై పరిశోధనలు చేశారు. గాయం చుట్టూ ఈ షుగర్ జెల్‌ను పూసి అధ్యయనం చేయగా.. అక్కడున్న వెంట్రుకలు అసాధారణంగా పెరగడాన్ని వారు గుర్తించారు. గాయానికి చికిత్సకు నోచుకోని ఎలుకల కంటే చికిత్స తీసుకుంటున్న ఎలుకల్లో వెంట్రుకల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో దీనిపై ప్రత్యేకంగా మరిన్ని పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫ్రాంటియర్స్ ఇన్ ఫార్మాకాలజీ జర్నల్‌లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
అధ్యయనంలో భాగంగా మగ ఎలుకలపై పరిశోధనలు చేశారు. వాటి శరీరంపై ఉండే వెంట్రుకలను తొలగించి రోజు డియోక్సీరైబోస్ షుగర్ జెల్‌ను పూశారు. కొన్ని రోజుల్లోనే వాటి శరీరంపై మందపాటి, పొడవైన వెంట్రుకలు మొలవడాన్ని గుర్తించారు. ఈ జెల్ జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను మెరుగుపరిచి, తద్వారా జుట్టు పెరిగేందుకు దోహద పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
వంశపారంపర్యంగా, జన్యు లోపాల వల్ల సంక్రమించే బట్టతలను ఆండ్రోజెనెటిక్ అలోపెసియా అని కూడా పిలుస్తారు. వృద్ధాప్యం, హార్మోన్ స్థాయుల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇది పురుషులు, మహిళల్లో వేర్వేరుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిపై ప్రభావం చూపుతున్నది. దీనికి పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి సమర్థంగా పని చేయడం లేదు. అంతేకాకుండా, ఈ చికిత్స వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండటం ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా కనుగొన్న చికిత్స ప్రభావవంతంగా పని చేసే అవకాశముందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మానవులపై అధ్యయనం చేయాల్సి ఉంది. అందులో మెరుగైన ఫలితాలు వస్తే బట్టతల సమస్యకు చెక్ పెట్టవచ్చు.