న్యూఢిల్లీ: కొన్ని రకాల సముద్ర జీవులు చూసేందుకే భయంకరంగా ఉంటాయి. ఆ భయంకరమైన జీవులు కూడా జనానికి ఆహారంగా ఉపయోగపడుతాయి. ఈ సముద్ర జీవులను కొంతమంది రకరకాలుగా వండుకుని తింటారు. అయితే ఇలాంటి జీవులను ఆహారంగా తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అజాగ్రత్తతో తింటే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.
దక్షిణ కొరియాకు చెందిన ఓ వృద్దుడు అలాగే లైవ్ ఆక్టోపస్ వంటకాన్ని తిని నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆక్టోపస్ మెలికలు తిరిగే పార్శాంగాలతో చూడటానికి కొంత భయంకరంగానే ఉంటుంది. తమకు ఆహారంగా ఉపయోగపడే జీవులపై దాడి చేసి చంపి తినేందుకు ఆక్టోపస్‌లు ఆ పార్శ్వాంగాలను వినియోగించుకుంటాయి. అయితే దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్‌లతో చేసే ప్రముఖ ‘సాన్ నాజ్కి’ అనే వంటకం రుచి చూసి మృతిచెందాడు. ప్రాణంతో ఉన్న ఆక్టోపస్‌ను ముక్కలుగా కోసి దానిపై నువ్వులు, కొన్ని రకాల మసాలాలను కలిపితే ఈ సాన్ నాజ్కి వంటకం రెడీ అవుతుంది.
దక్షిణ కొరియా వృద్ధుడు కూడా ఇలాగే తయారు చేసిన సాన్ నాజ్కి వంటకాన్ని ఆరగించాడు. అయితే అతను తింటున్నప్పుడు ఆ ఆక్టోపస్ పార్శ్వాంగ ముక్కలు కదులుతూనే ఉన్నాయి. దాంతో ఆక్టోపస్ పార్శ్వాంగం ముక్క ఒకటి మెలికలు తిరుగుతూ ఆ వృద్ధుడి గొంతులో ఇరుక్కుపోయింది. తర్వాత ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్‌కు గురై ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ లైవ్ ఆక్టోపస్ రెసిపీని 2003లో దక్షిణ కొరియాలో ఓ సినిమా నటుడు చేసి చూపించటంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
అప్పటి నుంచి చాలా మంది లైవ్ ఆక్టోపస్ రెసిపీని టేస్ట్ చేయడం ప్రారంభించారు. కానీ, ఇలా లైవ్ ఆక్టోపస్ రెసిపీని టేస్ట్ చేసి ఇప్పటికే ఇద్దరు మరణించారు. తాజాగా దక్షిణ కొరియా వృద్ధుడి మరణంలో ఆక్టోపస్ వంటకం తిని మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది.