రోమ్: విమానం ఇంజిన్ వద్ద ఉన్న ఓ వ్యక్తి ఆ ఇంజిన్ లాక్కోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ విమానాశ్రయంలో జరిగింది. విమానం బయలుదేరడానికి ముందు ఈ ఘటన జరిగింది. మిలాన్ బెర్గామో ఎయిర్పోర్టులో స్టాండ్ నుంచి స్టార్ట్ అయిన క్షణంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఓ మనిషి దాని వద్దకు పరుగెత్తాడని, ఆ సమయంలో ఇంజిన్ అతన్ని లాగేసుకుందని అధికారులు చెప్పారు.
ఆ వ్యక్తి ప్రయాణికుడు కాదు లేక అక్కడ పనిచేసే వ్యక్తి కూడా కాదు. ట్యాక్సీవే వద్దకు ఆ వ్యక్తి ఎలా వచ్చాడో తెలియడంలేదు. ఆగి ఉన్న కమర్షియల్ విమానంలో ఇంజిన్లు రన్నింగ్లో ఉన్నాయని, అయితే ఆ వ్యక్తి వాటి వద్దకు రావడంతో ఆ ఇంజిన్లు అతన్ని లాక్కున్నాయని అధికారులు చెప్పారు.
ట్యాక్సీవేపై ప్రమాదం జరగడంతో.. ఫ్లయిట్ ఆపరేషన్స్ కొంత సమయం నిలిపివేశారు. మిలాన్ విమానాశ్రయంలో 19 విమానాలను రద్దు చేశారు. కొన్ని ఆలస్యంగా నడిచాయి.