బీజింగ్: అమ్మ చేతి వంట తినాలంటే ఇకపై ఇంటి దగ్గరే ఉండనక్కర్లేదు. అమ్మ ఎంత దూరంలో ఉన్నా రుచికరమైన ఆహార పదార్థాలను ఆరగించవచ్చు. చైనీస్ కంపెనీ షెన్జెన్ డూబాట్ ఆవిష్కరించిన డూబాట్ ఆటమ్ రోబో దీనిని నిజం చేసి చూపించింది. షాన్డాంగ్లో ఉన్న ఈ రోబోకు 1,800 కి.మీ. దూరంలోని గ్వాంగ్డాంగ్లో ఉన్న ఆపరేటర్ వీఆర్ హెడ్సెట్ ద్వారా ఆదేశాలు ఇస్తూ, స్టీక్(మాంసం వంటకం)ను తయారు చేయించారు.
మన దేశంలో చెన్నైలో కూర్చుని 1,700 కి.మీ. దూరంలోని ఢిల్లీలో దీనిని తయారు చేయించినట్లు చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ విడుదల చేసిన వీడియో ప్రకారం, ఆపరేటర్ చేతి కదలికలను వీఆర్ ద్వారా ఈ రోబో గుర్తించి, అందుకు అనుగుణంగా పనులు చేసింది. స్టీక్ (మాంసం)ను తువ్వాలుతో తుడవడం, నూనెను వేయడం, మాడిపోకుండా అటు, ఇటు తిప్పడం వంటి పనులను చేసింది. తన చేతి వేళ్లతో ఉప్పును కూడా ఇది వంటపై జల్లింది. దీని ఖరీదు సుమారు రూ.23.7 లక్షలు. మార్చి నెలలో విడుదలైన ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేక రంగాల్లో పెను మార్పులను తీసుకురాగలదు.