న్యూయార్క్: ఓ 12 అడుగుల పైథాన్ ఒకటి జూ నుంచి తప్పించుకుంది. దాని కోసం రెండు రోజుల పాటు వెతగ్గా చివరికి ఓ షాపింగ్ మాల్లో ప్రత్యక్షమైంది. అమెరికాలోని లూసియానాలో ఈ ఘటన జరిగింది. అక్కడి బ్లూ జూ ఆక్వేరియం నుంచి కారా అనే 12 అడుగుల పొడవున్న పైథాన్ గత సోమవారం తప్పించుకుంది. దానిని పట్టుకోవడానికి రెండు రోజుల పాటు జూని మూసేసి అందులో పని చేసే సిబ్బంది అంతా వెతకడం ప్రారంభించారు.
మొత్తానికి అది పక్కనే ఉన్న మాల్ ఆఫ్ లూసియానాలో దాక్కొన్నట్లు గుర్తించారు. గురువారం ఉదయాన్నే మాల్లోని పైభాగంలో దాని తోక కనిపించింది. దీంతో జూ సిబ్బంది ఆ గోడను కాస్త కూలగొట్టి దానిని బయటకు తీశారు. ఈ విషయాన్ని సదరు జూనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేసింది.