సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ ల్యాబ్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్.. కరోనా కేసుల పెరుగుదలకు కారణమైంది. సిడ్నీకి చెందిన ల్యాబ్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ వల్ల వందలాది మంది పరిస్థితి అయోమయంగా మారింది. నిజానికి భారీ సంఖ్యలో జనం పాజిటివ్‌గా తేలినా.. నగరానికి చెందిన సిద్పాథ్ ల్యాబ్ రాంగ్ రిపోర్ట్లు ఇచ్చింది. క్రిస్మస్ పండుగ వేళ ఈ పొరపాటు జరిగింది. అయితే డేటా ప్రాసెసింగ్‌లో ఎర్రర్ జరిగినట్లు ఆ ల్యాబ్ చెబుతోంది. సుమారు 886 మందికి కరోనా సోకినా.. రిపోర్ట్‌లో మాత్రం వాళ్లంతా నెగటివ్ అని ఇచ్చారు. స్వాబ్ పరీక్షల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల ల్యాబ్ సిబ్బంది తీవ్ర వత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో ల్యాబ్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్‌తో పరిస్థితి మరింత భయానకంగా మారింది. పాజిటివ్ వచ్చిన 886 మంది తమకు కోవిడ్ సోకలేదని తమ బంధువులతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే జరిగిన తప్పు పట్ల సిద్పాథ్ ల్యాబ్ ఓ ప్రకటనలో క్షమాపణలు చెప్పింది. పరీక్షలు నిర్ధారణ కాకుండానే వందలాది మంది నెగటివ్‌గా తేలినట్లు ఆ ల్యాబ్ చెప్పింది. క్రిస్మస్ రోజున 400 మంది, ఇవాళ మరో 486 మంది పాజిటివ్‌గా తేలారు. కానీ ముందు ఇచ్చిన రిపోర్ట్‌లో వాళ్లంతా నెగటివ్‌గా ఉన్నట్లు ఆ ల్యాబ్ తెలిపింది. దురదృష్టవశాత్తు డేటా ప్రాసెసింగ్ ఎర్రర్ జరిగినట్లు ఒప్పుకున్న ఆ ల్యాబ్.. ఇక నుంచి కోవిడ్ స్వాబ్ టెస్టింగ్ సంఖ్యను తగ్గించనున్నట్లు వెల్లడించింది.