టోక్యో: జపాన్ నావికుడు కెనిచి హోరై చరిత్ర సృష్టించాడు. 83 ఏళ్ల వయసులో పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా దాటేశాడు. సోలోగా నౌకాయానం చేపట్టిన వృద్ధుడిగా ఆయన రికార్డు క్రియేట్ చేశాడు. మార్చి 27వ తేదీన కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆయన తన పడవలో బయలుదేరాడు. రెండు నెలల పాటు పసిఫిక్ సముద్రంలో ప్రయాణించిన ఆయన జపాన్‌లోని షికోకు దీవులకు చేరుకున్నాడు. 990 కిలోల బరువు ఉన్న సన్‌టోరీ మెరమెయిడ్ బోటులో ఆయన ప్రయాణం సాగింది.
బోటు ప్రయాణ సమయంలో తన వద్ద ఉన్న శాటిలైట్ ఫోన్‌తో ప్రతి రోజు ఫ్యామిలీతో మాట్లాడేవాడు. హోగో ప్రావిన్సులోని నిషియోమియా సిటీలో ఇవాళ కెనిచికి ఘనస్వాగతం పలకనున్నారు. అయితే పసిఫిక్ మహాసముద్రాన్ని దాటడం కెనిచికి ఇది మొదటిసారి కాదు. 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి కాలిఫోర్నియాకు వంటరిగా బోటుపై వెళ్లాడు. 19 అడుగుల ప్లైవుడ్ బోటుపై అతను అప్పట్లో 94 రోజులు ప్రయాణించాడు. వందేళ్లు వచ్చే వరకు కూడా ఇలాంటి ప్రయాణాలు చేయాలని కెనిచి నిశ్చయించుకున్నాడు.