న్యూయార్క్: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే. దానికి ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్(Operation Midnight Hammer)అని పేరు పెట్టారు. ఫోర్డో, నటాంజ్ అణు కేంద్రాలపై బీ2 బాంబర్లతో అమెరికా అటాక్ కొనసాగించింది. బీ2 స్టీల్త్ బాంబర్ విమానాలు ఆ దాడి కోసం సుమారు 4 లక్షల 20 వేల పౌండ్ల పేలుడు పదార్ధాలను మోసుకెళ్లాయి. వీటికి తోడు రీఫుయలింగ్ ట్యాంకర్లు, ఫైటర్ జెట్లు కూడా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అమెరికా బీ2 బాంబర్ విమానాలను కానీ ఇతర జెట్స్ రాకను ఇరాన్ పట్టికట్టలేకపోయింది. చాలా వ్యూహాత్మక రణనీతితో అమెరికా ఆ దాడికి పాల్పడింది. శత్రువును మోసపూరిత వ్యూహాలతో తికమకపెట్టింది. అతి రహస్యంగా ఆ ఆపరేషన్ నిర్వహించారు.
ఇరాన్ అంశంపై రెండు వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ట్రంప్.. తమ వ్యూహాన్ని దాచారు. రెండు వారాలు అని చెప్పి, రెండు రోజుల్లోనే అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా దాడి చేశారు. బీ2 స్టీల్త్ బాంబర్లను వినియోగించిన తీరు కూడా చాకచక్యంగా సాగింది. శనివారం రోజున తొలుత రెండు బీ2 బాంబర్లు మిస్సోరి నుంచి పశ్చిమ దిశగా వెళ్లాయి. దీంతో కొందరు ఆ విమానాలు పసిఫిక్‌కు వెళ్తున్నట్లు భ్రమ కల్పించారు. అయితే అదే సమయంలో ఏడు బీ2 బాంబర్లు.. బంకర్ బస్టర్లతో వైట్మాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి తూర్పు దిశగా దూసుకెళ్లాయి. ఏమాత్రం కమ్యూనికేషన్ లేకుండా అవి ముందుకు వెళ్లాయి.
తమ ప్లాన్ గురించి కేవలం కొద్ది మంది నేతలకు మాత్రమే తెలుసు అని ఎయిర్‌ఫోర్స్ జనరల్ డాన్ కెయిన్ తెలిపారు. 18 గంటల పాటు బీ2 స్పిరిట్ బాంబర్లు ప్రయాణించాయి. వాటిల్లో ఇద్దరేసి పైలెట్లు ఉన్నారు. మధ్యదార సముద్రం మీదుగా బాంబర్ విమానాలు ప్రయాణించాయి. వాటిని ఎవరూ డిటెక్ట్ చేయని రీతిలో తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఇరాన్‌పై అటాక్‌కు దిగారు. ఇరాన్ వైమానిక క్షేత్రంలోకి బీ2లు వస్తున్న సమయంలో.. ఫైటర్ జెట్స్తో పాటు ఇతర విమానాలు వాటికి ఎస్కార్ట్ కల్పించాయి.
దాడికి సంబంధించిన రూట్‌ను గ్రాఫిక్ రూపంలో అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ రిలీజ్ చేసింది. బీ2 యుద్ధ విమానాలు.. లబెనాన్, సిరియా, ఇరాక్ మీదుగా ప్రయాణించాయి. అయితే ఆ దేశాలకు ముందుగా సమాచారం ఉందా లేదో తెలియదు. దాడుల గురించి అమెరికా చట్టసభప్రతినిధులకు కూడా పూర్తిగా తెలియదు. చాలా గోప్యంగా ఆపరేషన్ నిర్వహించారు. ప్రపంచంలో ఎవరికీ తెలియకుండానే బీ2 బాంబర్లు ఇరాన్‌లోకి వెళ్లివచ్చినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్స్వర్త్ తెలిపారు.
ఇరాన్‌లోకి బీ2 విమానాలు ప్రవేశించడానికి గంట ముందు.. కీలకమైన టార్గెట్ల వైపు అమెరికా సబ్‌మెరైన్ నుంచి సుమారు రెండు డజన్ల తోమాహాక్ క్రూయిజ్ మిస్సైళ్లను రిలీజ్ చేశారు. ఇస్ఫహన్ యురేనియం సైట్ మీదకు కూడా ఆ మిస్సైళ్లు వెళ్లాయి. న్యూక్లియర్ సైట్ల వద్దకు బాంబర్లు చేరుకుంటున్న సమయంలో.. ఇరాన్ ఫైటర్ జెట్స్ కానీ, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లు కానీ ఏవీ అడ్డురాలేదని అమెరికా తెలిపింది.
వాషింగ్టన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.40 నిమిషాలకు.. టెహ్రాన్‌లో రాత్రి 2.10 నిమిషాల కాలమానం ప్రకారం అణు కేంద్రాలపై దాడి జరిగింది. ఆ సమయంలో జీబీయూ57 మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) బాంబును బీ2 రిలీజ్ చేసింది. సుమారు 14 ఎంఓపీ బాంబులను వినియోగించినట్లు పెంటగాన్ చెప్పింది. ఫోర్డో భూగర్భ యురేనియం శుద్దీకరణ ప్లాంట్‌పై బాంబులు వేశారు. తొలిసారి బంకర్ బస్టర్ బాంబర్‌ను వార్‌లో వాడారు. ఫోర్డోపై భారీ స్థాయిలో ఎంఓపీలతో పాటు ఇతర బాంబుల వర్షం కురిసింది. నటాంజ్ యురేనియం శుద్దీకరణ కేంద్రం పై కూడా భారీ సైజున్న బాంబుల్ని వేశారు. అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద బీ2 ఆపరేషనల్ స్ట్రయిక్.
The Pentagon displayed this graphic during its press briefing, detailing the route and timetable of the U.S. operation on Iran’s nuclear sites.
7 B-2 bombers dropped 14 MOPs. pic.twitter.com/amk8FpHv3P
— Alex Salvi (@alexsalvinews) June 22, 2025