న్యూయార్క్: అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న ఆల్ఫా జనసిస్ ల్యాబ్ నుంచి 43 కోతులు పరారీ అయ్యాయి. ఆ కోతులు అరుదైన రీసెస్ మకావే(Rhesus Macaque Breed) జాతికి చెందినవి. అయితే మెడికల్ టెస్టింగ్, పరిశోధనల కోసం ఆ జాతి కోతుల్ని ఆల్ఫా జెనసిస్ ల్యాబ్‌లో బ్రీడింగ్ చేస్తున్నారు. ఆ కోతులు కనిపిస్తే అధికారులకు ఫోన్ చేయాలని స్థానికులకు ఆదేశాలు ఇచ్చారు. తప్పించుకున్న ఆ కోతులన్నీ ఆడవే. వాటి బరువు ఒక్కొక్కటి సుమారు 3.2 కేజీలు ఉంటాయి.
రీసెస్ మకావే జాతి కోతులకు చాలా ప్రత్యేకత ఉన్నది. అవి అచ్చం మనిషి జన్యవులను కలిగి ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి ప్రయోగాల కోసం ఆ జాతి కోతుల్నే పరిశోధకులు వినియోగిస్తున్నారు. భూమండలంపై అత్యధికంగా అధ్యయనం చేసిన కోతుల్లో రీసెస్ మకావే జాతి కోతులే ఉన్నాయి. మనుషుల్లో ఉండే బలం, బలహీనతలను ఆ కోతులు స్పష్టంగా చూపగలవు. వాటి తెలివైన ప్రవర్తన, అవయవ వ్యవస్థ, జన్యు కోడింగ్ మనిషితో పోల్చినట్లుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గతంలో రాకెట్ల ద్వారా ఆ జాతి కోతుల్ని నింగిలోకి పింపారు. వాటిని జీనోమ్‌ను మ్యాపింగ్ కూడా చేశారు. వాక్సిన్లు, అవయవ మార్పిడులు లాంటి స్టడీలు వాటిపైనే చేస్తారు. 2003లో రీసెస్ కోతుల కొరత ఏర్పడింది. ఆ సమయంలో స్టడీ కోసం పదివేల డాలర్లు చెల్లించేవారు. ఆ జంతువులపై జరిగిన అధ్యయనం గురించి 1893లో తొలిసారి ఓ రిపోర్టును పబ్లిష్ చేశారు.
ఈ జాతి కోతుల కిడ్నీలపై 1950లో పోలియో వ్యాక్సిన్ పరీక్షించారు. స్పేస్ జర్నీలకు ఈ జంతువులను నాసా వాడింది. రీసెస్ జాతికి చెందిన కోతిని 1960లో మెర్క్యూరీ కాప్సూల్ ద్వారా నింగికి పంపారు. ఇదే జాతికి చెందిన కోతి డీఎన్ఏను 2007లో మ్యాపింగ్ చేశారు. రీసెస్ మకావే జాతి కోతి, మనిషి జన్యువుల్లోని డీఎన్ఏ 93 శాతం సమంగా ఉన్నట్లు తేలింది.