న్యూయార్క్, సెప్టెంబర్ 29: సిరియాపై అమెరికా జరిపిన దాడుల్లో 37 మంది మిలిటెంట్లు మరణించారు. సిరియా వాయువ్య ప్రాంతంలో ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా అనుబంధ గ్రూపులు, వారితో సంబంధాలు ఉన్న మిలిటెంట్లపై మంగళవారం రెండు చోట్ల గగనతల దాడులు చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం తెలిపింది. మృతులలో ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు కూడా ఉన్నట్టు పేర్కొన్నది.
అలాగే ఈ నెల 16న సెంట్రల్ సిరియాలోని మారుమూల అజ్ఞాత ప్రదేశంలో ఉన్న ఐఎస్ శిక్షణా శిబిరంపై పెద్దయెత్తున వైమానిక దాడులు చేసినట్టు తెలిపింది. ఆ దాడిలో నలుగురు సీనియర్ నేతలు సహా 28 మంది తీవ్రవాదులు మరణించినట్టు పేర్కొన్నది. తమ ప్రయోజనాలకు, అమెరికా మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసిస్‌ను అదుపుచేయడానికే ఈ వాయుసేన దాడులు జరుపుతున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.