లాపేజ్: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bolivia Accident) జరిగింది. శనివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 37 మంది చనిపోయారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితులు ఏర్పాడ్డాయి. క్షతగాత్రులకు ఉయునిలోని నాలుగు దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
శనివారం ఉదయం 7 గంటలకు ఉయుని, కొల్చాని రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయని, ఒకటి లోయలోకి దూసుకెళ్లినట్లు వెల్లడించారు. కాగా, జనవరిలో ఫొటోసీ, ఒరురో మధ్య 800 మీటర్ల లోయలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా మృతిచెందారు.