మాస్కో: ఉక్రెయిన్ ఆకస్మిక దాడి చేసింది. సోమవారం రాత్రి 337 డ్రోన్ల(Ukrainian Drones)తో ఉక్రెయిన్ అటాక్ చేసినట్లు రష్యా వైమానిక దళం ఆరోపించింది. అయితే ఆ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణశాఖ పేర్కొన్నది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. మాస్కోను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ భూభాగం నుంచి దాడి జరిగినట్లు రష్యా మిలిటరీ వెల్లడించింది. కుర్స్క్ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేసినట్లు తెలిపారు. అక్కడ సుమారు 126 డ్రోన్లను కూల్చివేశారు. ఇక మాస్కో ప్రాంతంలో అదనంగా 91 యూఏవీలను అడ్డుకున్నట్లు చెప్పారు.
సోమవారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ నైటంతా అప్డేట్స్ ఇచ్చారు. కేవలం మాస్కో సిటీ సమీపంలో 74 డ్రోన్లను కూల్చివేసినట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ చేపట్టిన అతి పెద్ద డ్రోన్ దాడి ఇదే అని మాస్కో మేయర్ తెలిపారు. కమికేజ్ డ్రోన్లను ఉక్రెయిన్ వాడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ డ్రోన్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లగలవని ఇటీవల ఉక్రెయిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. సోమవారం డొమోడీడోవ్ ప్రాంతంలోని పార్కింగ్ పై జరిగిన దాడిలో 20 వాహనాలు డ్యామేజ్ అయ్యాయి.
ఉక్రెయిన్ ప్రభుత్వం ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు రష్యా ఆరోపించింది. యుద్ధంలో నష్టపోవడం వల్లే ఉక్రెయిన్ ఇలాంటి దాడులు చేస్తోందని పేర్కొన్నది. తాజా దాడిని ఉగ్రవాదంగానే భావిస్తున్నట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది.