బంగుయి : సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని నగరం బంగుయిలో బుధవారం దారుణం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, బర్తెలెమి బొగండ హైస్కూల్లో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేశారు. అనంతరం విద్యుత్తును పునరుద్ధరిస్తుండగా పేలుడు సంభవించింది. ఆందోళనకు గురైన విద్యార్థులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ దుర్ఘటనలో 16 మంది విద్యార్థినులతోపాటు 29 మంది మరణించారు. 260మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని వేర్వేరు దవాఖానలకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు. పై అంతస్థుల్లోని విద్యార్థులు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఇరుకుగా ఉన్న మెట్ల మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి, కొందరు విద్యార్థులు నలిగిపోయి, స్పృహ కోల్పోయారు.