వాషింగ్టన్, డిసెంబర్ 13: ప్రత్యేక నైపుణ్యంగల విదేశీ ఉద్యోగులకు ఉద్దేశించిన హెచ్-1బీ వీసా ఫీజును 1 లక్ష డాలర్లకు(రూ. 90 లక్షలు) పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ కాలిఫోర్నియాతోపాటు మరో 19 అమెరికన్ రాష్ర్టాలు శుక్రవారం బోస్టన్లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీసా జారీకి అయ్యే నిర్వహణ ఖర్చులను మాత్రమే ఇమిగ్రేషన్ అధికారులు వసూలు చేయాల్సి ఉంటుందని, కాని ఫెడరల్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఫీజును విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రోబ బోంటా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో విదేశీ నిపుణుల కొరత ఏర్పడగలదని, దీని వల్ల వివిధ రంగాలు నష్టపోయే అవకాశం ఉందని రాష్ర్టాలు వాదించాయి.
విద్య, ఆరోగ్యం, ఇతర అత్యవసర సర్వీసులలో దీని ప్రభావం తీవ్రంగా ఉండగలదని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని ఆరోగ్య సిబ్బందిలో మూడు వంతుల మంది విదేశీ ఉద్యోగులే ఉన్నారని, అదే యూనివర్సిటీలు, దవాఖానలలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న నిపుణులే అధికంగా ఉన్నారని పిటిషనర్లు పేర్కొన్నారు.
భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు శుక్రవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలు అమెరికన్ ఉద్యోగులకు, వినియోగదారులకు, ద్వైపాక్షిక సంబంధాలకు హానికరంగా మారిందని వారు తమ తీర్మానంలో అభివర్ణించారు. సభ్యులు దేమోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
గ్రాడ్యుయేషన్ తర్వాత భారత్, చైనా సహా అనేక దేశాల విదేశీ విద్యార్థులను అమెరికా విడిచి వెళ్లేలా బలవంతం చేస్తున్న ప్రస్తుత నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పరిస్థితిని ‘అవమానకరం’గా అభివర్ణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యార్థులలో కొందరికి అమెరికా దేశం విద్యను అందించి, వారు డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత వారిని వెనక్కి పంపిస్తోందని అన్నారు. వీసా కొత్త నిబంధనల వల్ల అమెరికా కంపెనీలు విదేశీ గ్రాడ్యుయేట్లను ఉంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.