Operation Sindoor : తీవ్రవాదానికి, పాకిస్తాన్‌కు ఎంతటి విడదీయరాని బంధం ఉందో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యం కూల్చేసిన ఉగ్రవాద సంస్థ కాంప్లెక్స్‌ను పాక్ ప్రభుత్వం తిరిగి నిర్మించి ఇచ్చింది. అది కూడా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన బిల్డింగ్‌ను నిర్మించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలివి.
గత ఏడాది ఇండియాలోని పహల్గాంపై కాశ్మీర్ ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా పాక్‌పై ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీని ద్వారా పాక్ సరిహద్దుల్లో ఉన్న అనేక ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసి, అంతం చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ సరిహద్దులోని అనేక ఉగ్రవాద శిబిరాలు అంతమయ్యాయి. పలువురు ఉగ్రవాదులు మరణించారు. భారీ ఆస్తినష్టం జరిగింది. ఇందులో జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన మార్కాజ్ సుభానుల్లా కాంప్లెక్స్ కూడా ఉంది. ఇది పంజాబ్‌లోని బహవల్పూర్లో ఉంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియా జరిపిన దాడిలో ఈ బిల్డింగ్ చాలా వరకు ధ్వంసమైంది. నిరుపయోగంగా మారింది. అయితే, ఇది జరిగిన 15 నెలల్లోపే ఈ బిల్డింగును పాక్ ప్రభుత్వం తిరిగి నిర్మించి ఇచ్చింది. ఈ దాడి వల్ల కలిగిన నష్టాన్ని పాక్ ప్రభుత్వమే భరించింది. జైషే మొహమ్మద్ సంస్థకు రూ.25 కోట్ల పాక్ డబ్బులు చెల్లించింది. అందులో రూ.11 కోట్ల పాక్ డబ్బు ఈ కాంప్లెక్స్ నిర్మాణం కోసమే చెల్లించింది. ఇందులో మదర్సా ఉంటుంది. జైషే సంస్థ ఉగ్రవాదులకు ఇక్కడే శిక్షణ కూడా ఇస్తారు.
తీవ్రవాదులకు పాక్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాదులకు జరిగిన నష్టాన్ని పాక్ ప్రభుత్వం భరించింది. ఉగ్రవాదుల కోసం అనేక నిర్మాణాల్ని పాక్ చేపట్టింది.