Morocco earthquake | మరకేష్: ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో భూకంపం విలయం సృష్టించింది. పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. 1,037 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. భారీ భూకంపం తాకిడికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని అఘిల్ టౌన్ సమీపంలో, భూఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దేశంలో గత ఆరు దశాబ్దాల్లో సంభవించిన అతిపెద్ద విపత్తు ఇదేనని అధికారులు తెలిపారు. మరకేష్-సఫి ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాలు అధికంగా ఉన్నాయి. దాదాపు 45 లక్షల మంది ప్రభావితులయ్యారు.
సహాయక సిబ్బందికి కష్టాలు
సహాయక చర్యలకు మొరాకో మిలిటరీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ హుటాహుటిన రంగంలోకి దిగినప్పటికీ, రహదారులపై వాహనాలు చిక్కుకోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. రోడ్లపై పెద్ద పెద్ద రాళ్లు పోగుపడటంతో సహాయక బృందాలు బాధితుల వద్దకు చేరుకోవడం ఆలస్యమవుతున్నదని అధికారులు తెలిపారు.
దెబ్బతిన్న చారిత్రక కట్టడాలు
ఈ ప్రకృతి విలయంతో చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. పన్నెండో శతాబ్దంనాటి కౌటౌబియా మసీదు దెబ్బతింది. మరకేష్ పాత నగరంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రెడ్ వాల్స్ కూడా దెబ్బతిన్నాయి. ఉత్తర ఆఫ్రికాలో భూకంపాలు చాలా అరుదు అని అధికారులు చెప్పారు. ఈ పర్వత ప్రాంతంలో నమోదైన భూకంపాల్లో ఇది చాలా తీవ్రమైనదని తెలిపారు. అగడిర్ పట్టణంలో 1960లో సంభవించిన భూకంపం తీవ్రత భూకంప లేఖినిపై 5.8గా నమోదైందని, అప్పట్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దీంతో మొరాకోలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు జరిగాయన్నారు.