వార్సా: పోలాండ్‌లో ఉన్న బొగ్గు గని(Poland Coal Mine)లో ప్రమాదం జరిగింది. గనిలో పనిచేస్తున్న పది మంది కార్మికులు గాయపడ్డారు. డజన్ల సంఖ్యలో మిస్సైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శక్తివంతంగా భూమి కంపించడంతో.. సుమారు 1200 మీటర్ల లోతులో ఉన్న రుడల్టోవీ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. అయితే ఏ కారణం చేత భారీ కంపం వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియదు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలాండ్ కోల్ మైనింగ్ గ్రూపు ప్రతినిధి అలెగ్జాండ్రా విసోకా సింబిగా తెలిపారు. కొందర్ని పైకి తీసుకువచ్చామని, ఇంకా కొంత మంది వద్దకు రెస్క్యూ బృందం వెళ్తోందన్నారు.
ప్రమాద సమయంలో బొగ్గు గనిలో 68 మైనర్లు పనిచేస్తున్నారు. 15 మందిని పైకి తీసుకువచ్చారు. దాంట్లో పది మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎయిర్ అంబులెన్స్‌లను వినియోగిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన కార్మికుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. రుడల్టోవీ గనిని 1792లో ఓపన్ చేశారు. ప్రస్తుతం ఆ గనిలో 2వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.