అంకారా: టర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోటల్లో అగ్నిప్రమాదం(Hotel Fire) జరిగింది. ఆ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా, 32 మంది గాయపడ్డారు. బోలో ప్రావిన్సులో ఉన్న గ్రాండ్ కర్తాల్ హోటల్లో ప్రమాదం జరిగింది. 12 అంతస్తులు ఉన్న ఆ హోటల్లో తెల్లవారుజామున 3.30 నిమిషాలకు అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. హోటల్ మంటల నుంచి తప్పించుకునే క్రమంలో దూకిన ఇద్దరు బాధితులు కూడా మృతిచెందారు.
ప్రమాద సమయంలో హోటల్ కస్టమర్లు కొందరు బెడ్ షీట్లు, బ్లాంకెట్ల సాయంతో రూమ్‌ల నుంచి కిందకు వచ్చే ప్రయత్నంచేశారు. హోటల్‌కు నిప్పు అంటుకున్న సమయంలో.. 234 మంది గెస్టులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నిద్రలో ఉన్నప్పుడు నిప్పు అంటుకున్నదని, వెంటనే బయటకు పరుగులు తీశామని ఓ స్కీయింగ్ ఇన్స్ట్రక్టర్ తెలిపారు.
హోటల్ గదుల్లో పొగ కమ్ముకుపోవడంతో.. గెస్టులు ఫైర్ ఎస్కేప్‌ను లొకేట్ చేయడం కష్టంగా మారిందన్నారు. హోటల్‌కు చెందిన రూఫ్‌తో పాటు టాప్ ఫ్లోర్లు కూడా అగ్నిప్రమాదంలో ఆహుతయ్యాయి. గ్రాండ్ కర్తాల్ హోటల్లో మొత్తం 161 రూమ్‌లు ఉన్నాయి. దేశ రాజధాని ఇస్తాంబుల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరొగ్లు పర్వతాల్లో స్కీయింగ్ రిసార్టు ఉన్నది.
స్కూళ్లకు సెమిస్టర్ సెలువులు ఇవ్వడంతో.. రిసార్టులన్నీ పూర్తిగా గెస్టులతో నిండిపోయాయి. ప్రమాదం జరిగిన హోటల్ వద్దకు 30 ఫైర్ ట్రక్కులు, 28 అంబులెన్సులను పంపారు.