దెయిర్ అల్ బలాహ్: హమాస్ పాలనలోని గాజా స్ట్రిప్ భూభాగంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ దళాలు మరింత దూకుడుగా ముందుకెళ్తున్నాయి. సోమవారం ఉదయం గాజా సిటీని చుట్టుముట్టాయి. దాదాపు వారం పాటు తీవ్రమైన యుద్ధం తర్వాత ఇక్కడ వరకు వచ్చామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజా సిటీలోకి బలగాలు ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయని, మరో 48 గంటల్లో ఇది జరిగే అవకాశం ఉన్నదని ఇజ్రాయెల్ మీడియా పేర్కొన్నది. ఉత్తర గాజాను తక్కిన గాజా స్ట్రిప్ ప్రాంతంతో వేరుచేసిన ఐడీఎఫ్ దళాలు.. ఉత్తర గాజాపై ఆదివారం రాత్రి నుంచి పెద్దయెత్తున వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి.