కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 9 : హరితహారం స్ఫూర్తితో రోడ్డు పక్కన కాలినడక బాటలకిరువైపులా నాటుతున్న మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నగరంలో పలుచోట్ల కాలినడక బాటలు ఉండగా వాటిలో కొన్ని ప్రజలు నడకకు ఉపయోగిస్తుండగా మరికొన్ని చోట్ల వీధి వ్యాపారులు, చిరు దుకాణాల ఆక్రమణలు ఉన్నాయి. పాదచారుల కోసం ఉపయోగపడాల్సిన ఫుట్‌పాత్‌లను ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకరావాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్‌పాత్‌లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిపోవడంతో పాటు ఫుట్‌పాత్‌లపై నడుస్తున్న వారికి పార్కులలోని వాకింగ్ ట్రాక్‌లపై నడుస్తున్న అనుభూతిని పొందుతున్నారు. విభిన్నంగా కూకట్పల్లి జోన్లో చేపట్టిన ఫుట్‌పాత్ పక్కన మొక్కలు నాటే విధానం పలువురిని ఆకట్టుకుంటుండటంతో ఇదే తరహాలో మరికొన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి జీడిమెట్ల సూరారం వరకు ఇటీవలే ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేశారు. రోడ్డు పక్కనున్న ఆక్రమణలను తొలగించి పాదచారుల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ఫుట్‌పాత్‌లపై ఆయా ప్రాంతాల్లో చిరు వ్యాపారులు తిష్టవేయడం.. కొన్నిచోట్ల నిరుపయోగంగా మారాయి. దీంతో కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత ఫుట్‌పాత్‌లను పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించుకునేలా చేయడంతో పాటు ఫుట్‌పాత్‌లకు ఇరువైపులా షర్బ్ ప్లాంటేషన్, మల్టీలేయర్ ప్లాంటేషన్ చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. సుమారు 8 కిలోమీటర్ల దూరం ఫుట్‌పాత్‌కు ఇరువైపులా 80 వేల మొక్కలను నాటారు. ఫుట్‌పాత్‌కు రోడ్డువైపు షర్బ్ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటగా రెండోవైపు బహుళ వరుసలుగా ఆహ్లాదాన్నందించే మొక్కలు నాటారు. స్కేర్ మీటర్‌కు పది మొక్కల చొప్పున రంగురంగుల పూలమొక్కలు, పచ్చదనాన్ని అందిస్తూ స్థానిక వాతావరణాన్ని తట్టుకుని నిలబడే మొక్కలను నాటారు. ఫుట్‌పాత్‌లకు ఇరువైపులా నాటిన మొక్కలతో ఆ కాలినడక మార్గం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి జీడిమెట్ల వరకు ఉన్న ఫుట్‌పాత్ పక్కన ఖాళీ స్థలంలో గుడారాలను ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రత్యేక వెండింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఫుట్‌పాత్‌కు ఇరువైపులా మొక్కలు నాటాలంటే వీధి వ్యాపారులను అక్కడినుంచి పంపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సమీపంలోని ఖాళీ స్థలంలో వెండింగ్ జోన్‌ను ఏర్పాటు చేసి వారికి అందులో వీధి వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించారు. వెండింగ్ జోన్ ఏర్పాటుతో వీధి వ్యాపారులకు కష్టాలన్నీ తీరగా ఫుట్‌పాత్‌కు ఇరువైపులా నాటిన మొక్కలతో బాటసారులకు ప్రత్యేక అనుభూతిని అందించడంతో స్థానిక ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హరితహారంలో ఎక్కువ మొక్కలు నాటి సంరక్షించే అవకాశమున్న అంశాలపై దృష్టిసారించాం. బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫుట్‌పాత్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో వీధి వ్యాపారులకు వెండింగ్ జోన్‌ను ఏర్పాటు చేసి ఫుట్‌పాత్‌కు ఇరువైపులా బహుళ వరుసలుగా మొక్కలు నాటాం. ఈ పనితో ఆ ఫుట్‌పాత్‌పై నడిచే వారు ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. అలాగే సెంట్రల్ మీడియన్ ప్లాంటేషన్, థీమ్ పార్కుల ఏర్పాటుతో పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాం.- వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్