బంజారాహిల్స్,మే 19: ట్రాన్స్జెండర్ గదికి వచ్చి కత్తితో బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10(సి)లోని గాయత్రీహిల్స్లో నివాసం ఉంటున్న నమ్రత వర్మ అనే ట్రాన్స్జెండర్ మెసేంజర్ రిపబ్లిక్ పేరుతో వెబ్సైట్లో పోర్టల్ క్రియేట్ చేసింది. ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీ కోసం పెట్టిన ఈ వెబ్పోర్టల్లో నమ్రత వర్మ ఫోన్ నెంబర్ పెట్టింది. ఆమె నెంబర్కు శివ అనే యువకుడు ఫోన్ చేశాడు.
మాట్లాడే పని ఉందంటూ సోమవారం సాయంత్రం నమ్రత గదికి వచ్చిన శివ కొంతసేపటి తర్వాత తనతో తెచ్చుకున్న కత్తి చూపిస్తూ ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. తనకు రూ.5లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేయడంతో గట్టిగా కేకలు వేయడంతో పక్కింట్లో ఉంటున్న వ్యక్తులు వచ్చి శివను పట్టుకున్నారు. ఈ మేరకు బాధితురాలు నమ్రత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకుని శివను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని మీద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.