వెంగళరావునగర్, మే 30 : బ్యాంకు అకౌంట్లు వాడుకుంటామని నమ్మించి ఇద్దరు యువతుల పేర్ల మీద లక్షల రూపాయల పర్సనల్ లోన్లు తీసుకుని మోసగించాడు. పోలీసులు కథనం ప్రకారం.. యాదగిరినగర్కు చెం దిన 23 ఏళ్ల యూట్యూబర్ దీవెన తన స్నేహితురాలు నవ్యజ్యోతికి నాగరాణి అనే స్నేహితురాలి ద్వారా రాజశేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనది రియల్ ఎస్టేట్ వ్యాపారమని, తన బ్యాంకు అకౌంట్ లో ఎక్కువ సార్లు లావాదేవీలు జరిపితే ఆదాయపు పన్ను ఎక్కువగా పడుతుందని, అందుకే బ్యాంకు అకౌంట్స్ ఇస్తే నెలకు రూ. 20 వేలు చెల్లిస్తామని రాజశేఖర్ వారిని నమ్మబలికాడు.
రాజశేఖర్ చెప్పిన మాటలు నమ్మి దీవెన తన స్నేహితురాలు నవ్యజ్యోతికి తెలిపింది. ఇద్దరూ కలిసి బ్యాంకు ఖాతాలు ఇవ్వడానికి అంగీకరించడంతో రాజశేఖర్ వారిని మూసాపేటలోని ఒక అపార్ట్మెంట్లోని ఒక ప్లాట్ కు పిలిపించుకున్నాడు. అక్కడ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ ఉన్నాడని చెప్పి వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, సంతకాలతో పాటు ధ్రువపత్రాలను తీసుకున్నాడు.
మరుసటి రోజు వారికి కొత్త సిమ్ కార్డులు ఇచ్చి యాక్సిస్ బ్యాంకు లో కూడా అకౌంట్ తెరిపించాడు. కాగా గత సంవత్సరం ఆగస్టు నుంచి ఈ సంవత్సరం మే వరకు వారికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. వారి ఫోన్లకు రాజశేఖర్ జవాబు ఇవ్వడం మానేశాడు. ఈ నెల 19న ఐసీఐసీఐ బ్యాంకు వారు దీవెనకు ఫోన్ చేసి మీరు రూ. 10 లక్షలు పర్సనల్ లోన్, నవ్య జ్యోతి రూ. 15 లక్షల లోన్ తీసుకున్నారని వాటిని తిరిగి చెల్లించాలని తెలిపారు. బాధితులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.