కుత్బుల్లాపూర్, నవంబర్ 2: అతిగా మద్యం సేవించి ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లి ముందున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం… ఓంసాయికాలనీ గాయత్రీనగర్‌లో నివాసం ఉంటున్న అన్నవరం సాయికృష్ణారెడ్డి(24) శనివారం తెల్లవారుజామున గాయత్రీనగర్ నుంచి అల్వాల్ వైపునకు వెళ్తుండగా మార్గమధ్యలో వెన్నెలగడ్డ చెరువు సమీపంలో ఉన్న పోచమ్మదేవాలయం వద్ద ఉన్న టర్నింగ్లో అతివేగంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయింది.
ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభం తలకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన 108కి సమాచారం అందించారు. సుచిత్రలోని రష్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడు అప్పటికే పుల్గా మద్యం సేవించి ఉన్నాడని, తన వెనకాల మరో స్నేహితుడు కూడా ఉన్నాడని, అతడు స్వల్పగాయాలతో బయటపడినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.