Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్ 7 ( నమస్తే తెలంగాణ ): నగరంలోకి టీ ఏటీఎం కూడా వచ్చేసింది. ఎల్బీనగర్ బస్ స్టాప్ పక్కన శనివారం ఈ టీ ఏటీఎం ప్రారంభమైంది. వెండింగ్ టెక్నాలజీలో కొత్త ఒరవడి సృష్టించిన హైదరాబాద్‌కు చెందిన జెమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ గతంలో గోల్డ్ ఏటీఎంను నగరానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఈ టీ ఏటీఎంలో కాఫీ, లెమన్‌టీ, బాదం, పాలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్ అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేసి ఆప్షన్స్ ఆధారంగా ఆపరేట్ చేస్తే మనకు కావాల్సినవి వచ్చేస్తాయి. ఈ కార్యక్రమంలో జెమ్ఓపెన్ క్యూబ్ సీఈఓ వినోద్ కుమార్, డైరెక్టర్ వెంకటేశ్ యాదవ్, త్రిలోచనద తదితరులు పాల్గొన్నారు.