విభాగంలో అవినీతి అక్రమాలు తారా స్థాయికి చేరాయి. టెండర్ నిబంధనలను ఉల్లంఘించి అనుకూల వ్యక్తులకు పనులను కట్టబెడుతున్నారు. జీవో నం. 66, 99లను తమకు అనుకూలంగా మలుచుకుంటూ అనర్హులకు అందలం ఎక్కిస్తూ అందినంత కమీషన్ల పర్వానికి తెరలేపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఆదాయానికి లబ్ధి చేకూర్చాల్సిన ఇంజినీర్లే స్వయంగా సంస్థ ఖజానాకు గండికొడుతూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గత సంఘటనలు మినహాయిస్తే తాజాగా ఎల్బీనగర్ జోన్ టెండర్ల కేటాయింపులో తీవ్ర అక్రమాలు చోటు చేసుకున్నాయి. అర్హత కలిగిన కాంట్రాక్టర్లను పకనపెట్టి, తమకు అనుకూలమైన వారికి పనులు కట్టబెడుతూ ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు గండికొట్టిన తీరు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే ..ఎల్బీనగర్ జోన్ పరిధిలో జూలై 2026 నుంచి మార్చి 2027 వరకు మానవ వనరులు, యంత్రాల సరఫరా (ఎస్టీఎఫ్ బృందాల)కు రూ.91,56,257 లక్షల విలువైన పనులకు సంబంధించి సంబంధిత ఇంజినీర్ టెండర్ నోటిఫికేషన్ (టెండర్ ఐడీ 723192) విడుదల చేశారు.
ఈ టెండర్ ప్రక్రియలో నిబంధనల ప్రకారం పూర్తి అనుభవం ఉన్న ఏజెన్సీలు(సివిల్ కాంట్రాక్టర్) పోటీ పడ్డాయి. ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గించేలా అత్యల్పంగా 35శాతం లెస్‌కు కోట్ చేశారు. అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) నాగేందర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. 35శాతం లెస్తో ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసే ఏజెన్సీని అన్యాయంగా తిరసరించి, కేవలం 5శాతం లెస్ వేసిన తమ అనుకూల కాంట్రాక్టర్‌కు ఈ టెండర్‌ను ఖరారు చేశారని సదరు బాధిత ఏజెన్సీ ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హత ఉన్న తమను పకనబెట్టి, అధిక రేట్లకు టెండర్ కేటాయించడంపై కాంట్రాక్టర్ వరికుప్పల స్వామి మున్సిపల్ కమిషనర్‌తో పాటు విజిలెన్స్ ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టెండర్ ప్రక్రియపై విజిలెన్స్ విభాగంతో వెంటనే సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా జరిగిన అగ్రిమెంట్‌ను తక్షణమే నిలిపివేసి, సదరు టెండర్‌ను రద్దు చేయాలన్నారు. పారదర్శకంగా తిరిగి కొత్త టెండర్లు పిలిచి అర్హులైన వారికి పనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఈ ఫిర్యాదు ప్రతులను సూపర్ ఇంటెండింగ్ ఇంజినీర్ (ఎల్బీనగర్ జోన్), జోనల్ కమిషనర్‌కు అందజేసినట్లు కాంట్రాక్టర్ స్వామి తెలిపారు. కాగా అధికారుల కనుసన్నల్లోనే ఈ టెండర్ కమీషన్ల వ్యవహారం నడిచిందా? అన్న కోణంలో విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.